కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని అన్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుపడల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
''బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు'' అని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాగా.. ఈ కేసులో మే 1న హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.