కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కుంగిన బ్యారేజ్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 1:46 PM GMT
cm revanth reddy, kaleshwaram, medigadda barrage,

కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన విషయం తెలిసిందే. కుంగిన బ్యారేజ్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు. కుంగిన బ్రిడ్జి, పిల్లర్‌లను పరిశీలించారు. కాగా.. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. మద్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్‌కు వెళ్లిన సీఎం, మంత్రులు ఏడో బ్లాక్‌ లోని పియర్స్‌ను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్యారేజీ లోటుపాట్లను ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలు నీరు ఇచ్చామని చెప్పుకున్నారని చెప్పారు. ఇక అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని.. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ వివరించిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే.. ఈ సమస్యను 2020-21లోనే గుర్తించిన ఇంజినీర్లు అప్పటి సీఎంకు చెప్పినా వినలేదని అన్నారు. సమస్యను చక్కదిద్దే పనులు చేపట్టకుండా మేడిగడ్డ బ్యారేజ్‌ ఇప్పుడు కుంగిపోయే స్థితికి తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్‌ బిల్లులు ఏటా రూ.10,500 కోట్లు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపితే రూ25వేల కోట్లు ఏటా అవసరం అవుతున్నాయని చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజ్‌లో కూడా ఇప్పుడు నీరు లేదని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందన్నారు రేవంత్. వర్షకాలం వస్తే సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల్లో ఉన్న సమస్యలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

Next Story