Telangana: జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వస్తున్న విన్నపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
By - అంజి |
Telangana: జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వస్తున్న విన్నపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సెన్సస్ (జనగణన) ప్రక్రియ ముగిసే వరకు పరిపాలనా విభాగాల సరిహద్దుల మార్పుపై నిషేధం విధించినందున, మార్చి 31, 2027 తర్వాతే ఈ అంశాలను జ్యుడీషియల్ కమిషన్‌కు పంపుతామని ఆయన ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' బహిరంగ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రంతో చర్చించి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. అలాగే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద పునరుద్ధరించి, ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు రూ. 1,259 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో ఎత్తిపోతల పథకాలు, చెరువుల పునరుద్ధరణతో పాటు ముధోల్, బోథ్, నిర్మల్ నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' ఏర్పాటు వంటివి ఉన్నాయి. రాజకీయం కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను కూడా సమానంగా ఆదరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో త్వరలోనే ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ. 225 కోట్లు మంజూరు చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.