సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 8:02 PM IST
సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండ్రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి తన వల్ల ఎవరూ ఇబ్బందులు పడొద్దని భావించారు. తన కోసం.. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని.. వాహనదారులకు ఇబ్బందులు కలిగించొద్దని పోలీసులకు చెప్పారు. తాను సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్తాననీ.. తన కాన్వాయ్‌కు అనుమతి ఇవ్వాలని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రజలతో పాటే తన కాన్వాయ్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ వాహనాదారులకు, ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో చెప్పినట్లు సమాచారం. కాగా.. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు.. ఇతర రాజకీయ ప్రముఖులు పర్యటనలకు వస్తే రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపిస్తుంటారు పోలీసులు. ప్రత్యేకించి నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. దాంతో.. ప్రయాణికులు కాసేపు వేచి చూడక తప్పడు. కొందరు అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్న సమయంలో ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తన కాన్వాయ్ విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తన కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్లరంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.