Telangana: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ప్రమాదవశాత్తు చనిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ కుటుంబానికి సీఎం రేవంత్ అండగా నిలిచారు.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 10:56 AM GMT
cm revanth reddy, convey, give route,  ambulance,

Telangana: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు స్విగ్గీ డెలివరీ బాయ్‌ చనిపోయాడు. అతని కుటుంబానికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు. మృతుడి కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్‌ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు సీఎం రేవంత్‌రెడ్డి.

అయితే.. ఈ నెల 23న గిగ్‌ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ గురించి మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని చెప్పారు. కానీ.. బీఆర్ఎస్‌ సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం బాధకలిగించిందని చెప్పారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు కేవలం వారం రోజుల్లో మృతుడి కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాదిత స్విగ్గీ బాయ్‌ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి సీఎం చేతుల మీదుగా రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆర్థిక సాయం అందుకున్న తర్వాత సదురు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు కేబీఆర్‌ పార్క్‌ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ ఓ అంబులెన్స్‌కు దారిచ్చింది. ఉదయం 11.45 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి కారు కేబీఆర్ పార్క్‌ నుంచి వెళ్తుంది. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ పక్కకు జరిగి.. అంబులెన్స్‌కు దారిచ్చింది. సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు దారిచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బందులు పడొద్దని.. తన కాన్వాయ్‌ కోసం గంటల కొద్ది వారిని ఆపొద్దని చెప్పిన విషయం తెలిసిందే.


Next Story