Telangana: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు.
By అంజి
Telangana: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలన్నారు. జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదన్నారు. డీలిమిటేషన్ జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పాడిపోతుందని తెలిపారు.
''లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని సభ కోరుతోంది'' అని తెలిపారు.
''కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశ్యంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయటం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటేప్రామాణికం కాకూడదు'' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
''పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఇప్పుడున్ననియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజాజనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతే కాకుండా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది'' అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ తెలిపారు.