తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక సూచనలు

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యుత్తమ స్థాయిలో...

By -  అంజి
Published on : 7 Dec 2025 7:34 AM IST

CM Revanth, arrangements, Telangana Rising Global Summit, TelanganaRising2047

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక సూచనలు

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యుత్తమ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 కు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సదస్సు నిర్వహిస్తున్న మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు.

తర్వాత వేదిక ప్రాంగణమంతా కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వహించాలని చెప్పారు.

సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. TelanganaRising2047 దార్శనికత ఉట్టిపడే విధంగా ఆయా అంశాలపై ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను వీక్షించారు.

అంత‌ర్జాతీయ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు, కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు స‌మ్మిట్‌కు హాజ‌ర‌వుతున్నందున వారికి స్వాగ‌త ఏర్పాట్లు, వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు.

ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోజన వసతి వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రాంగణంలో భద్రతా పరమైన ఏర్పాట్లతో పాటు ఫైర్ సేఫ్టీ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.

Next Story