తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్‌పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారంటూ, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. బీఆర్‌ఎస్ కోతి చేష్టలను రాష్ట్ర సమాజం గమనిస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్‌ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని బీఆర్‌ఎస్ వ్యహరిస్తోందన్నారు.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటిపైకి దూసుకొచ్చారని తెలిపారు. అటు షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అసెంబ్లీలో చెప్పు విసిరారని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ ఓ వీడియోను విడుదల చేసింది. పవిత్రమైన సభలో కాంగ్రెస్ తన మార్క్ కండకావరం ప్రదర్శించిందని మండిపడింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ చెప్పు విసిరారని, ఆయనపై ఎస్సీ, ఎస్సీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కాగా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చంపి స్పీకర్‌పై వేశారని కాంగ్రెస్ మండిపడింది.