'ఆ రహదారులకు అనుమతులు ఇవ్వండి'.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజిన‌ల్ రింగు రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి.. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు.

By అంజి  Published on  13 Dec 2024 7:34 AM IST
CM Revanth, Union Minister Gadkari, roads, Telangana state

'ఆ రహదారులకు అనుమతులు ఇవ్వండి'.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజిన‌ల్ రింగు రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి.. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో స‌మావేశ‌మై రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను తెలియజేసి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగాన్ని 161 AA జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించింద‌ని చెప్పారు. ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని. ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.

ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. తెలంగాణ‌లోని రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాలన్నారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళుతోంద‌ని, ఈ ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌ల నుంచి నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కోరారు.

పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాల‌ని, న‌ల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story