నేడు తెలంగాణ హరితోత్సవం.. మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ హరితోత్సవం ( ‘హరిత ఉత్సవం’ ) కింద సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే
By అంజి Published on 19 Jun 2023 7:23 AM ISTతెలంగాణ హరితోత్సవం ( ‘హరిత ఉత్సవం’ ) కింద సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర అటవీశాఖ చేస్తున్న కృషిని, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపుదలను ఇందులో వివరించనున్నారు. ఇవాళ సీఎం .. 9వ విడత హరితహారం ప్రారంభిస్తారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలోని అర్బన్ పార్కులో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొక్కలు నాటడం ద్వారా హరిత ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు . 25 ఎకరాల్లో 25 వేల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్‌ఎం డోబ్రియాల్ హరిత ఉత్సవం గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలను ఈ కార్యక్రమంలో కవర్ చేయాలి. నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలన్నింటిలో హరితహారంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రదర్శిస్తారు. ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. అన్ని అర్బన్ పార్కులకు ఆ రోజు ఉచిత ప్రవేశం ఉంటుందని, వాటిని సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. మొక్కల పెంపకం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆమె అన్నారు.
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ హరితహారం కోసం రూ.10,822 కోట్లు ఖర్చుపెట్టింది. మొక్కల కోసం 14,864 నర్సరీలు ఏర్పాటుచేసింది. ప్రస్తుతం తెలంగాణలో 13.44 లక్షల ఎకరాల్లో అడవులు పెరిగాయి. 2.03 లక్షల ఎకరాల్లో మొక్కల్ని పెంచుతున్నారు. అడవుల్లో 24.53 కోట్ల మొక్కలు నాటారు. మొత్తంగా హరితహారం ద్వారా 53.84 కోట్ల మొక్కలు పెరిగి చెట్లు అయ్యాయి.
జూన్ 20ని తెలంగాణ విద్యా దినోత్సవంగా జరుపుకోనున్నారు. విద్యారంగంలో సాధించిన విజయాలను తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం జూన్ 21న దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలలో వివిధ కార్యక్రమాలతో నిర్వహించబడుతుంది. జూన్ 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో వేడుకలు ముగుస్తాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రజలు అమరవీరులకు నివాళులర్పించి మౌనం పాటించనున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అమరవీరుల స్మారకార్థం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.