కుటుంబ సమేతంగా శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. నేడు స్టాలిన్‌తో భేటీ
CM KCR visits RanganathaSwamy temple with family.ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో
By తోట వంశీ కుమార్ Published on 14 Dec 2021 8:10 AM ISTముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. నిన్న ఆయన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఆలయానికి చేరుకున్న కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం లభించింది. తిరుచ్చి జిల్లా కలెక్టర్ శ్రీనివాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్ కు స్వాగతం పలికారు.
ఆలయ సందర్శనకు కేసీఆర్‌తో పాటు ఆయన భార్య శోభ, తనయుడు మంత్రి కె.తారకరామారావు, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ లు ఉన్నారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారని, రంగనాథస్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు సీఎం కేసీఆర్ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తనుకు మంచి మిత్రుడని, ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత మంగళవారం చెన్నైలో తొలిసారిగా కలుస్తున్నట్లు తెలిపారు.
నేటి సాయంత్రం స్టాలిన్‌తో భేటీ..
చెన్నైలో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటికానున్నారు. గత కొంతకాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం, రైతులు, వ్యవసాయ అంశాలపై దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఇతర బలమైన రాజకీయ పార్టీలను కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా..? అందులో భాగంగానే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారా.? అన్న చర్చ మొదలైంది. ఇక మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకూ స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.