తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తృతంగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సాన్ని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా నేడు, రేపు ఏరియల్ సర్వే చేయాలని బావించారు. అయితే.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేడు(ఆదివారం) ముంపు ప్రాంతాల పర్యటనకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరారు. ఈ ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెలుతున్నారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
దాదాపు నాలుగు గంటల పాటు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇల్లందు, పాత పాల్వంచ మీదుగా రోడ్డు మార్గాన భద్రాచలం వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రమే సీఎం కేసీఆర్ వరంగల్‌లోని టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటి అయి ముంపు నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఉదయం అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటూరు నాగారం బయలు దేరారు.