గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం: సీఎం కేసీఆర్

హెచ్‌ఐసీసీలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  1 Sep 2023 12:45 PM GMT
CM KCR, Vajrotsavalu , Telangana, HICC,

గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. గత సంవత్సరం వజ్రోత్సవాలను 15 రోజులు నిర్వహించామని చెప్పారు. భారత పోరాట చరిత్రను నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని.. వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని సీఎం కేసీఆర్ అన్నారు. రాజ్‌గురు, భగత్‌సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ వీరత్వం నీటి తరానికి స్పూర్తిగా ఉండాలని కేసీఆర్ అన్నారు.

మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయడం విషాదకరమని కేసీఆర్ అన్నారు. గొప్ప నాయకుల్లో గాంధీజీ అగ్రగన్యులని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. గాంధీ చూపించిన అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు. ఇప్పటికీ యావత్‌ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉండేదని.. టీఆర్ఎస్‌ను స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో చెప్పానన్నారు. మొదట కొందరు ఏకీభించకపోయినా.. రానురాను తాను ఎంచుకున్న మార్గమే సరైందని అందరూ నడిచారని సీఎం కేసీఆర్ చెప్పారు. అహింస మార్గాన్ని విడకూడదనే తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బందుతోపాటు అనేక సంక్షేమ పథకాలతో గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వగలిగామని అన్నారు. గ్రామాలు సుసంపన్నంగా మారుతున్నాయని అన్నారు. ప్రజలందరికీ తాగునీరు కూడా గతంలో ఇవ్వలేకపోయారని.. కానీ ఇప్పుడు ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.

Next Story