4న యాదాద్రికి సీఎం కేసీఆర్..
CM KCR tour in yadadri 4th of March.ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2021 3:29 PM ISTతెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి ప్రధాన ఆలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆర్టీసీ బస్ టెర్మినల్, డిపోలను నిర్మించనున్న స్థలాలను కేసీఆరర్ పరిశీలించనున్నారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించి నిర్మాణ పనులై అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అనంతరం లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు సన్నద్దమవుతున్నారు. సీఎంవో నుంచి అందిన సమాచారం మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం రోజుల పాటు సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం అవుతున్నారు. అయితే ప్రధాన ఆలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటంతో మరో మూడు మాసాల్లో ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా పరిశీలించాలని కేసీఆర్ నిర్ణయిచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కేసీఆర్ పర్యటన అధికారికంగా ధృవీకరించలేదని తెలుస్తోంది.
అయితే ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని భావిస్తున్నారు.