తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావొచ్చాయి. ఇక సచివాలయాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తుండగా.. అందుకు ముహూర్తాన్నిఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్, మజీద్ కూడా నిర్మిస్తున్నారు. సచివాలయం తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను, అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి కావాలన్నారు. మూడు షిప్టుల్లో 24 గంటల పాటు పనులు కొనసాగుతున్నాయి.