తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు కరోనా సోకింది. ఈ మేరకు సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు. కరోనాకు సంబంధించి కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ప్రెస్ నోట్‌లో వెల్లడించారు. దీంతో కేసీఆర్.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇదిలావుంటే.. ఇటీవల సీఎం కేసీఆర్.. నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాగర్ సభ ఎఫెక్ట్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఇక సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు కూడా కరోనా సోకడం కొసమెరుపు.
ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,009 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 14 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా మృతి చెందిన వారి సంఖ్య 1,838కి చేరింది.