కొన్ని అసెంబ్లీలు మన కలెక్టరేట్ అంతకూడా లేవు: సీఎం కేసీఆర్
అభివృద్ధిలో చాలా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 5:48 PM ISTకొన్ని అసెంబ్లీలు మన కలెక్టరేట్ అంతకూడా లేవు: సీఎం కేసీఆర్
సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. ఆ తర్వాత రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించారు. మార్కెట్‌లో కాసేపు కలియతిరిగి దాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా నూతన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు. అనంతరం 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అందరి కృషితోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్న సందర్భంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని.. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సూర్యాపేట కలెక్టరేట్‌తో కలిపి 23 ప్రారంభించామని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో మనం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
అయితే.. అభివృద్ధిలో చాలా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలు, సెక్రటెరియట్‌లు కూడా సరిగ్గా లేవని అన్నారు. తెలంగాణలో ఉన్న కలెక్టరేట్ అంతకూడా తమ సెక్రటెరియట్ లేదని తనతో పలువురు చెప్పారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో గతంలోలాగా పస్తులు ఉండే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో ప్రజలు విలవిల్లాడారని.. ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయం స్వయంగా కేంద్రమే ప్రకటించిందన్న విషయాన్ని తెలిపారు.