హైదరాబాద్‌లో కరెంటు పోదు.. అందుకే పదే పదే చెప్తున్నా: సీఎం కేసీఆర్
CM KCR spoke at the public meeting organized after the inauguration of Medchal Malkajgiri Collectorate. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ కేసీఆర్
By అంజి Published on 17 Aug 2022 12:32 PM GMTపరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ కేసీఆర్ మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన ఎవరూ మేడ్చల్ జిల్లా అవుతుందని ఏనాడూ కల కూడా కనలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం రావడంతో మేడ్చల్ జిల్లా ఏర్పడటం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో 11వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకాబోతున్నాయని సీఎం చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చకాచకా ప్రజలకు వేగంగా అందుతున్నాయని అన్నారు.
తెలంగాణలో 36లక్షల పెన్షన్లు ఉన్నాయని, ఇప్పుడు మరో 10లక్షల పెన్షన్లు ఆగస్టు 15 నుంచి పంచుతున్నామని చెప్పారు. 57 సంవత్సరాల వయస్సు దాటిన వారికి పెన్షన్ ఇస్తున్నామని, కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తికమక అయిన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైందన్నారు. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటే 46లక్షలకు పెన్షన్లు చేరుకుంటున్నాయని, ఈ 46లక్షల పెన్షన్‌దారులకు అద్భుతమైన కొత్త కార్డులు ఎలక్ట్రానిక్ బార్‌కోడ్లతో పంపిణీ చేస్తున్నాని తెలిపారు. రాబోయే వారం పదిరోజుల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
''హైదరాబాద్‌లో కరెంటు పోదు.. అదే దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు రాదు. దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా. ఆదిలాబాద్ గోండు గూడెంలో, వరంగల్ లంబాడీ తండాలో, హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఎక్కడైనా సరే 24 గంటలూ ఉంటుంది. ఇంతకుముందు చాలా మంది కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్లు, పొడుగున్నోళ్లు సీఎంగా ఉన్నారు. వాళ్లెందుకు కరెంటు ఇవ్వలేదు? ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే మెదడు రంగరించి ఫలితాలు సాధిస్తారు.'' అని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభం
మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యాలయంలో సీట్‌లో కలెక్టర్ ఎస్ హరీశ్‌ను కూర్చొబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎస్ హరీశ్ పాల్గొన్నారు.