ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది: సీఎం కేసీఆర్‌

CM KCR spoke after hoisting the national flag on Golconda Fort. దేశ వ్యాప్తంగా స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో

By అంజి  Published on  15 Aug 2022 11:20 AM IST
ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది: సీఎం కేసీఆర్‌

దేశ వ్యాప్తంగా స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా.. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్ర త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో యావత్‌ తెలంగాణ త్రివర్ణ శోభితంతో మురిసి మెరిసిపోతోందన్నారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన ఆ మహానీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం మనందరి బాధ్యతన్నారు. ప్ర‌తి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది అని తెలిపారు.

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ సీఎం కేసీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, ఆదర్శాలనీ, విలువలనీ నేటితరానికి సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీన ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నామని, ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకోబోతున్నామని కేసీఆర్‌ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ''1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు.'' అని పేర్కొన్నారు.

భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు దేశ నిర్మాణంలో అద్బుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన శక్తి తెలంగాణ రూపొందిందన్నారు.

Next Story