ఆ సమస్యకు జస్టిస్ ఎన్వీ రమణ చొరవతోనే పరిష్కారం : సీఎం కేసీఆర్
CM KCR Speech in State Judicial Officers Conference.ఎనిమిది సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి
By తోట వంశీ కుమార్ Published on 15 April 2022 11:34 AM IST
ఎనిమిది సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహాయ, సహకారాలతో ముందుకు పురోగమిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెక్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయధికారులో సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లోనూ సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామన్నారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ, పరిపాలన విభాగం కూడా గొప్పగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్ పట్ల చాలా ప్రేమ ఉన్నదని అన్నారు. హైకోర్టు విడిపోయిన తరువాత బెంచీల సంఖ్య పెంపునకు కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశానని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారని, అయితే.. సీజేఐ రమణ చొరవతో రాష్ట్ర హైకోర్టులో బెంచీల సంఖ్యను 24 నుంచి 42 పెంచారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరుపున జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని, మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక జిల్లా, సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువనే సమాచారం ఉందని, ఈ సమస్య పరిష్కారానికి హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ చొరవ చూపాలని సీఎం కేసీఆర్ కోరారు.
ఈ న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.