కామారెడ్డి BRS నేతలకు సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.

By -  Srikanth Gundamalla
Published on : 9 Nov 2023 3:01 PM IST

CM KCR, serious warning, kamareddy, brs leaders,

 కామారెడ్డి BRS నేతలకు సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది. నామినేషన్ల దాఖలుకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. దాంతో.. ముఖ్యనాయకులతో పాటు ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసుల వద్దకు పోటెత్తుతున్నారు. కొందరు నాయకులు భారీగా ర్యాలీ తీస్తూ నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. ఇంకొందరు వినూత్నంగా వెళ్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు.. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు అక్కడికి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. బీఆర్ఎస్ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముందుగా నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌రెడ్డికి వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడ జిల్లా పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులకు ఎన్నికలను ఉద్దేశించి పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల్లో గెలవడంపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల కామారెడ్డిలో చోటుచేసుకున్న వివాదాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. గ్రూప్‌ తగాదాలు వీడాలని.. కలిసికట్టుగా పనిచేయాలంటూ కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సీఎం కేసీఆర్ సూచించారు.

ఈ క్రమంలోనే వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని నేతలకు సూచించారు. అలా చేయడం ద్వారా ఓటర్లలో బీఆర్ఎస్‌పై నమ్మకం పోయే అవకాశాలు లేకపోలేవని అన్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బీఆర్ఎస్‌ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇక అంతకుముందు తన నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి కూడా సీఎం కేసీఆర్ నామినేషన్ వేశారు. ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ నుంచి గజ్వేల్‌కు వెళ్లిన కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

Next Story