తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఎట్టి పరిస్థితిల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించమని చెప్పారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయక్రమశిక్షణతోనే కరోనాను నియంత్రించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. బాధతోనే స్కూళ్లను మూసివేశామన్నారు. కరోనా మహమ్మారి ఎవ్వరికీ అంతుపట్టకుండా తెలంగాణ సహా ప్రపంచాన్ని వేదిస్తోందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉందని, టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తోందని తెలిపారు.
కరోనా విషయంలో మన రాష్ర్ట ప్రభుత్వం భేష్‌గా ఉందని.. టెస్టుల సంఖ్యను పెంచామన్నారు. నిన్న ఒక్కరోజే 70 వేలు టెస్టులు చేశారన్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించామని.. సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించి.. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా థియేటర్లను ఓపెన్ చేశామని తెలిపారు. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు. కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందన్నారు. పరిశ్రమల మూతవేత ఉండదని స్పష్టం చేశారు.