అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్ర్యతేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగ సంక్షేమ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ సచివాలయంలోని అన్ని విభాగాలకు, అన్ని విభాగాల అధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని.. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.