కలెక్టర్లతో భేటీ కానున్న సీఎం కేసీఆర్.. దళిత బంధుపై కీలక ప్రకటన..!
CM KCR Review meeting with all District collectors.సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం సమావేశం
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2021 6:14 AM GMTసీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ భేటి జరగనుంది. ఈ భేటిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలో వివిధ పథకాల అమలు, వ్యవసాయంతో పాటు దళత బంధు ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. దళితబంధుతో పాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, పథకాల అమలు, కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు పై కూడా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లు, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. హరితహారం, మెడికల్ కాలేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, పల్లెప్రగతి, పట్టణప్రగతి, ధరణి సమస్యల వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.
దళిత బంధుపై కీలక ప్రకటన
ఈ సమావేశం అనంతరం దళిత బంధు పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాం సాగర్ మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి లో పలువురికి పంపిణీ కూడా జరిగింది. ఇక అన్ని జిల్లాల్లో దళిత బంధును ఈ ఆర్థిక సంవత్సరంలోనే పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.