వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సహనం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలను మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శం అని సీఎం అన్నారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా వుందని, జైనం తెలంగాణ గడ్డ మీద పరిఢవిల్లిందని, జైన తీర్థంకరుల పాద ముద్రలతో తెలంగాణ నేల పావనమైందని అన్నారు. కష్టాలు ఎన్ని ఎదురైనా తెలంగాణ సామాజిక సహజీవనం శాంతి, సహనంతో, బతుకు బతికించు అనే విధానాన్ని కొనసాగించడంలో ఇమిడి ఉన్నదని సీఎం అన్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇతరులకు హాని చేయవద్దనే లక్ష్యంతో సాగిన మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో సబ్బండ వర్గాలు అనుసరించిన శాంతియుత పంథాలో జైన తీర్థంకరుల శాంతి, సహనం బోధనలు అంతర్లీనంగా ఇమిడి వున్నాయని సీఎం తెలిపారు. కరోనా సమయం మానవ జాతికి ఒక పరీక్షా సమయమనీ, మహావీరుని బోధనల స్ఫూర్తితో సహనంతో వ్యవహరిస్తూ, స్వీయ కట్టుబాట్లు నిబంధనలను అనుసరిస్తూ కరోనాను జయిద్దామని సీఎం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.