కేసీఆర్ భారీ స్కెచ్.. బీఆర్‌ఎస్ ప్లీనరీకి ప్రాంతీయ పార్టీల చీఫ్‌లు.!
కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి బీఆర్‌ఎస్ ప్లీనరీని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు.
By అంజి Published on 21 March 2023 10:14 AM ISTకేసీఆర్ భారీ స్కెచ్.. బీఆర్‌ఎస్ ప్లీనరీకి ప్రాంతీయ పార్టీల చీఫ్‌లు.!
హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ల భేటీ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీని మినహాయించి కొత్త జాతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ ప్లీనరీని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌కు రీబ్రాండింగ్ చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇదే తొలి ప్లీనరీ కానుండడంతో, ప్రాంతీయ పార్టీల నేతలతో వేదిక పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి 'నేషనల్ టచ్' ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27న జరగనుండగా, కొత్త సచివాలయ ప్రారంభోత్సవం ఏప్రిల్ 30న జరగనుంది.
తన పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు.. జనవరి 24న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జేఎంఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్‌లను సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సచివాలయం ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నేతలతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
అయితే ఫిబ్రవరి 11న, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ స్థానిక అధికారుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో.. సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే తాజాగా మార్చి 10న ఏప్రిల్ 30న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చేస్తామని ప్రకటించిన సీఎం.. ఈసారి మాత్రం సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పుడు కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి బదులు సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలను బీఆర్ఎస్ ప్లీనరీకి ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ యాదవ్ మార్చి 17న కోల్‌కతాలో మమతా బెనర్జీని కలుసుకుని, 2024 లోక్‌సభ ఎన్నికలలోపు కాంగ్రెస్ లేకుండా కొత్త ఫ్రంట్ లేదా కూటమి ఏర్పడుతుందని మీడియాతో చెప్పడంతో కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ అఖిలేష్‌తో చాలా కాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత డిసెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ హాజరయ్యారు. జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ మొదటి బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో కలిసి పాల్గొన్నారు.