నల్లగొండ జిల్లాలోని గ్రామపంచాయతీలపై కేసీఆర్ వరాల జల్లు.. ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్
CM KCR public meeting in Haliya.నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ వరాల జల్లు.
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2021 12:20 PM GMTనల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలపై వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయని.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20లక్షలు చొప్పున, మండల కేంద్రాలకు రూ.30లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి వాటిని విడుదల చేస్తామన్నారు. రేపు వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
గతంలో నాతో కలిసి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నా పక్కన లేకపోవడం బాధాకరం అని కేసీఆర్ అన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫించన్, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మాట ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. కృష్ణా, గోదావరిని అనుసంధానం చేసి నల్లొండ జిల్లా కాల్లు కడుగుతామన్నారు. నల్లగొండ జిల్లా చాలా నష్టపోయిన జిల్లా అని.. ఏ నాయకుడు, ముఖ్యమంత్రి ఈ జిల్లాను పట్టించుకోలేదన్నారు. ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు. ఒకవేళ చేయలేకపోతే.. ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలకు వార్నింగ్..
కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని.. తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. హద్దు మీరితే ఏం చేయాలో తెలుసన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు కాదా అన్నారు.