హైదరాబాద్‌లో కుట్రలకు దిగుతున్నారు: సీఎం కేసీఆర్
CM KCR Press meet I హైదరాబాద్‌లో కుట్రలకు దిగుతున్నారు: సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 26 Nov 2020 6:36 AM GMTహైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అరాచక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ఆ అరాచక శక్తులకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌నగరంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడామే ముఖ్యమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే వారిపై కఠినంగా వ్యవహరించాలని, సంఘ విద్రోహశక్తులను అణచి వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేస్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఐజీలు శివశంకర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారని, ముందుగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో ప్రజలను ఏమారచాలని చూశారు. తర్వాత మాటలతో కవ్వింపుచర్యలకు దిగుతున్నారు. డబ్బులు పంచి ఓట్లు దండుకునే ప్రయత్నాలు హైదరాబాద్‌లో నడవవని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు.
అలాగే రాష్ట్రంలోని కరీంనగర్‌లో, వరంగల్, ఖమ్మం, మరోచోటనో గొడవలు సృష్టించి అరాచకాలు సృష్టించి హైదారాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలని, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచిస్తున్నారని అన్నారు. ఎలాంటి అల్లర్లు సృష్టించినా ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.