తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి ప్రధానాలయానికి ఉత్తరం దిశలోని మరో కొండపైన 13.2 ఎకరాల విస్తీర్ణంలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను నిర్మించారు. ఆలయాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. చిన్న కొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్‌ను నిర్మించారు. సుమారు రూ.104 కోట్లతో వీటిని నిర్మించారు.
ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యాగశాల నిర్వహణ స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు. అనంతరం భువగిరికి సీఎం వెళ్లనున్నారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు.