దీపావళి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) అమలుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. మునుగోడులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పీఆర్సీ అమలుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి రోడ్లు భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు లేఖ పంపించారని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
సీఈవో తన నిర్ణయాన్ని తెలిపిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు పీఆర్సీని అమలు చేస్తామని బాజిరెడ్డి తెలిపారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పెండింగ్ డీఏలు, పండుగ అడ్వాన్స్‌ను సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ అమలుకు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్యోగుల సంక్షేమానికి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడంతో టిఎస్‌ఆర్‌టిసి ఆదాయ మార్గంలో పయనిస్తోందని చెప్పారు.