గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం గొప్ప విషయం : సీఎం కేసీఆర్
CM KCR Mahatma Gandhi Statue Inauguration At Gandhi Hospital.బాపూజీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2022 1:25 PM ISTకరోనా మహమ్మారి వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆనాడు యావత్ భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ అని అన్నారు. ప్రపంచ నేతలకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. గాంధీ పుట్టి ఉండకపోతే తాను అమెరికా అధ్యక్షుడిని కాలేకపోయేవాడినని ఒబామా అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనం అందరం చేసుకున్న పుణ్యమన్నారు. అహింస, శాంతి, ధర్మం, సేవా సిద్ధాంతాలు విశ్వజనీనమని చెప్పారు. సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చెప్పిన మహానీయుడు గాంధీ అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ పోరాటం చేసినప్పుడు తనను కూడా అవహేళన చేసినట్లు సీఎం తెలిపారు. అప్పుడు తాను గాంధీజీనే స్మరించుకునేవాడినన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ఆయనే ప్రేరణ. దేశం బాగుంటే అందరం బాగుంటాం. శాంతి లేకపోతే జీవితం చాలా బాధగా ఉంటుందని అన్నారు.
గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయన ఆదర్శరాలను కొనసాగిస్తున్నారని సీఎం ప్రశంసించారు. కరోనా సమయంలో రోగులను మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడారన్నారు. వసతులు లేకున్నా ప్రజలకు సేవ చేశారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ధ్యానముద్రలో ఉన్న ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం అని, ఏర్పాటుతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని చెప్పారు.