హైదరాబాద్ : సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలను ఖరారు చేశారు. అధికారిక ప్రకటన అనంతరం.. డిసెంబర్ 10న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని సమీక్షించే అవకాశం ఉంది. ఆ వెంటనే ప్రభుత్వం ఈ పథకంపై ప్రకటన చేయన్నుట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రూ.3 లక్షల ఆర్థికసాయం అందించే పథకాన్ని మరో 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సొంత భూమి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఎంపికైన వ్యక్తులకు వాయిదాల పద్ధతిలో రూ.3 లక్షలు చెల్లిస్తారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించని గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం 75 చదరపు గజాల స్థలం ఉన్న మహిళకు ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది.
తహసీల్దార్, ఎంపీడీఓ లబ్ధిదారులను గుర్తించి దరఖాస్తులను కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. అయితే సంబంధిత ఎమ్మెల్యే, మంత్రుల పరిశీలన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు కూడా రూ. 3 లక్షలే ఇవ్వనున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ. 3 లక్షలకు మించి సాయం అందించే అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారని సమాచారం.