వైద్య ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
CM KCR key directions to the Department of Medical Health.ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 5:48 AM GMTఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలం కావడం.. దానికి తోడు అన్ని ఆస్పత్రులు కూడా కరోనా రోగులతో నిండి ఉండడంతో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాంధీ, టిమ్స్ వంటి చోట్ల అగ్నిమాపక యంత్రాలు సిద్దంగా ఉంచాలన్నారు.
ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు యుద్ద విమానాల ద్వారా తీసుకువస్తున్నామన్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రులకు సరఫరా చేయాలన్నారు. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య పెరగడంతో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇక తెలంగాణలో నేడు 7,432 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా శనివారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో వెల్లడింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3.87లక్షలను దాటాయి. రాష్ట్రంలో నిన్న 33 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులో 2,152 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటికి నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారిసంఖ్య 3.26లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 1,464 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్ 486, ఖమ్మం 325 వరంగల్ అర్బన్ 323, మహబూబ్‌నగర్ 280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.