పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
CM KCR Inaugurates telangana state police integrated command control center. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను
By అంజి Published on 4 Aug 2022 8:43 AM GMTహైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేశారు. సీఎం వెంట హోంమంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. రూ. 600 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. 2017లో కమాండ్ అండ్ కంట్రెల్ సెంటర్ నిర్మాణానికి పునాది వేశారు.
ఐసీసీసీ ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్. ఈ భవనంపై ఉన్న సోలార్ ప్యానెల్స్ 0.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ భవన నిర్మాణం కోసం రీసైకిల్ చేయబడిన మెటిరీయల్‌ను వాడారు. 6.42 లక్షల చదరపు అడుగుల నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో ఐదు టవర్లు ఉన్నాయి. టవర్-ఎ 20 అంతస్తులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను కలిగి ఉంటుంది. టవర్-బిలో డయల్-100, షీ సేఫ్టీ, సైబర్ అండ్ నార్కోటిక్స్, క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని బ్యాకప్‌లతో టెక్నాలజీ ఫ్యూజన్ టవర్ ఉంటుంది.
టవర్-సిలో ఆడిటోరియం ఉంటుంది. టవర్-డిలో మీడియా మరియు శిక్షణా కేంద్రం ఉంటుంది. టవర్-ఇలో అన్ని విభాగాల సమన్వయం, సీసీటీవీ పర్యవేక్షణ, వార్ రూమ్, రిసీవింగ్ రూమ్ కోసం కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్ ఉంటుంది. భవనంపైన హెలిప్యాడ్ కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 9.22 లక్షల కెమెరాలు ఈ సీసీసీకి అనుసంధానించబడతాయి. ఫీల్డ్ పోలీసింగ్‌కు మద్దతుగా బ్యాక్-ఎండ్ ఆపరేషన్‌లలో పనిచేసే సాంకేతిక బృందాలను ఉంచడానికి రూపొందించబడిన ఈ భవనంలో వార్ రూమ్ ఉంటుంది.
వార్ రూమ్ అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలను అనుసంధానంగా ఉండి డిజాస్టర్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా కూడా పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్ల కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. ఈ భవనంలో తెలంగాణ పోలీసుల చరిత్రను ప్రదర్శించే మ్యూజియం ఉంది. అలాగే ప్లాంటేషన్ కోసం 35 శాతం భూమిని కేటాయించారు. ఈ కొత్త భవనంలో యోగా కేంద్రం, వ్యాయామశాల, వెల్నెస్ సెంటర్ కూడా ఉన్నాయి.