కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సు లు, 84 మంది లాబ్ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. తద్వారా రూ. 9.02 కోట్ల భారం రాష్ట్ర ఖజానా పై పడనుంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలను నిర్వహించి, అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.