కేసీఆర్‌ దమ్మేంటో దేశం మొత్తం చూసింది: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 10:44 AM GMT
CM KCR,  achampet,  BRS, Telangana elections,

కేసీఆర్‌ దమ్మేంటో దేశం మొత్తం చూసింది: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల సవాళ్లకు కేసీఆర్ కౌంటర్ విసిరారు. కొడంగల్‌కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు తనకు సవాళ్లు విసురుతున్నారని.. అయితే. తన దమ్మేంటో దేశం మొత్తం ఎప్పుడో చూసిందన్నారు. కొత్తగా చూపించాల్సింది ఏమీ లేదన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం తాను పోరాడుతున్న సమయంలో ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదంటూ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు.

తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరి ప్రయాణం ప్రారంభించానని సీఎం కేసీఆర్ అన్నారు. తన పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే తెలంగాణ సాధనలో విజయం సాధించానని పేర్కొన్నారు. సరిపడా కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేసీఆర్ చెప్పారు. ఇవాళ దేశం మొత్తంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని.. అందుకు గర్వంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ దిక్సూచిగా ఉంటోందని పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రజలు ముంబైకి వలస పోయినప్పుడు ఎవరు వచ్చారంటూ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో.. ఎప్పుడు ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.

తెలంగాణ ప్రయాణం పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం తన వంతు పోరాటం చేశానని.. ఇక చేయాల్సింది ప్రజలే అన్నారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండేది.. కానీ ఇప్పుడు తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని కేసీఆర్ చెప్పారు. గతంలో 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరతానని జనారెడ్డి సవాల్ విసిరారు అని గుర్తు చేశారు. కానీ.. తమ ప్రభుత్వం అది సుసాధ్యం చేయడంతో ఆయన వెనక్కి తగ్గారని అన్నారు. రైతుబంధు పథకానికి ఆద్యుడు సీఎం కేసీఆర్.. రైతు బంధుని దశలవారీగా రూ.16వేలకు పెంచుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే అన్నీ గమనించి.. ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందనేది తెలుసుకోవాలన్నారు సీఎం కేసీఆర్.

Next Story