హైదరాబాద్: ప్రపంచ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను అందుకున్న 16 ఏళ్ల ఉప్పల ప్రణీత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం రూ.2.5 కోట్లు ప్రకటించారు. అతి చిన్న వయసులోనే చదరంగంలో ప్రణీత్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ సోమవారం నాడు ప్రణీత్‌ను, అతని తల్లిదండ్రులను సచివాలయానికి పిలిపించి గ్రాండ్‌మాస్టర్‌ను ఆశీర్వదించారు. కష్టపడి పనిచేసి మంచి శిక్షణ ఇచ్చిన ప్రణీత్ తల్లిదండ్రులను అభినందించారు. ప్రణీత్ అభిరుచి, కృషి అతడిని గ్రాండ్‌మాస్టర్‌ని చేశాయని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రణీత్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రణీతకు శిక్షణ, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.2.5 కోట్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తోందనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదగడమే ఇందుకు నిదర్శనమని, క్రీడారంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
వీర్లపల్లి నందిత (19)ను ప్రపంచ చెస్ ఫెడరేషన్ 'ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్'గా నిలిచినందుకు అభినందనలు తెలిపిన కేసీఆర్.. ఆమెకు అధునాతన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ.50 లక్షలు ప్రకటించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.