మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
CM KCR Announced Kusukuntla Prabhakar Reddy is TRS Munugode by Poll Candidate.మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా
By తోట వంశీ కుమార్
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య వంటి నేతలు టికెట్ ఆశించినప్పటికి ప్రభాకర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట ప్రభాకర్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌటింగ్ పూర్తైన తరువాత అదే రోజు ఎవరు గెలిచారు అనే దానిని ప్రకటించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఇప్పటికే చండూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక ఉప ఎన్నికకు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరు తహశీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురుకి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఇవ్వనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం స్థానిక జడ్పీహెచ్ఎస్‌లో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్‌పోస్టుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నారు.