ఏం తక్కువ చేసినా.. కరెంట్‌ ఇవ్వలేదా? నీళ్లు ఇవ్వలేదా?: సీఎం కేసీఆర్‌

CM KCR addressed a public meeting in Vikarabad. తెలంగాణ బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. జిల్లా పర్యటనలో బీజేపీ నాయకులు అడ్డురావడంపై

By అంజి  Published on  16 Aug 2022 1:11 PM GMT
ఏం తక్కువ చేసినా.. కరెంట్‌ ఇవ్వలేదా? నీళ్లు ఇవ్వలేదా?: సీఎం కేసీఆర్‌

తెలంగాణ బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. జిల్లా పర్యటనలో బీజేపీ నాయకులు అడ్డురావడంపై కేసీఆర్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ జెండాలు పట్టుకుని తన బస్సుకే అడ్డం వస్తారా? అంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ ప్రారంభం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయన్నారు. తెలంగాణలో మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, జాతీయ పార్టీల రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదని, ఇవాళ ఎవరూ పడితే వారు మాట్లాడుతున్నారని అన్నారు. మన బాధలు చూడనివారు, మన ఇబ్బందులు పటించుకోనివారు ఇవాళ అడ్డం పొడవు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ కోసం 14 సంవ‌త్స‌రాలు పోరాటం చేశానని, చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించానన్నారు. తెలంగాణ వచ్చిన త‌ర్వాత ప్రజలు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామని చెప్పారు.. ఈ ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగాలని, అలాగే ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ, వ్య‌వ‌సాయ రంగాల్లో ముందుకు పోవాలన్నారు.

ఇవాళ తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోందని, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్నవారు మనం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెప్తున్నారని అన్నారు. 8 ఏళ్ల నుంచి ఒక్క మంచి పనైనా బీజేపీ చేసిందా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ప్రజలందరూ చర్చ పెట్టాలన్నారు. రాజ‌కీయంగా చైత‌న్యం లేని స‌మాజం లేకపోతే దోపిడికి గుర‌వుతామన్నారు. స‌మైక్య పాల‌కుల చేతిలో విల‌విల‌లాడిపోయారని, పెరుగు అన్నం తినే రైతులు పురుగుల మందు తాగి చ‌చ్చిపోయారని, మళ్లీ ఆ బాధలు రావొద్దంటే మనం అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు.

బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆ జెండాను ప‌ట్టుకుంటే మ‌ళ్లీ పాత క‌థ‌నే వ‌స్తుంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం మేలు చేయ‌క‌పోగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే ప‌థ‌కాల‌ను ఉచితాలు అని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ''ఇవాళ గ్యాస్, పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిపోయాయి. బ్యాంకుల‌ను దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద షావుకార్ల‌కు ల‌క్ష‌ల కోట్ల రూపాయాలు దోచిపెట్టారు. దీనికేనా బీజేపీ జెండాలు అడ్డు తెచ్చేది. వికారాబాద్‌కు కేసీఆర్ ఏం త‌క్కువ చేసిండు. క‌రెంట్ ఇవ్వ‌లేదా? మంచినీళ్లు ఇవ్వ‌లేదా? క‌లెక్ట‌రేట్ ఇవ్వ‌లేదా? నిధులు ఇవ్వ‌లేదా? సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కాలేదా? ఇవ‌న్నీ మీరు ఆలోచించాలి. గోల్ మాల్ కావొద్దు.'' అని కేసీఆర్ అన్నారు.

Next Story
Share it