వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

CM KCR About‌ Non-Agriculture land Registration. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు

By Medi Samrat  Published on  15 Nov 2020 12:38 PM GMT
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూశాం. నవంబర్ 23న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాన‌ని సీఎం అన్నారు.


Next Story