రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకే పీపుల్స్ మార్చ్ : మల్లు భట్టి విక్రమార్క
CLP Leader Mallu Bhatti Vikramarka padayatra started in Khammam District.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను చేపట్టారు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో పాదయాత్రను ప్రారంభించారు. 33 రోజుల పాటు 135 గ్రామాల గుండా యాత్ర సాగనుంది. ప్రతి రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది.
ఈ రోజు ఉదయం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి యడవల్లి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సమస్యలు పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అయితే రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. సంపద మొత్తం కొంత మంది పాలకుల చేతుల్లోకి వెలుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారన్నారు. 8 ఏళ్లుగా ఇళ్లు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు.. రైతులు రోడ్లపైకి వస్తున్నారు.. దళిత రైతులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? అని ప్రశ్నించారు. సమస్యల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అంటే నలుగురు కుటుంబ సభ్యులు, నలుగురు మంత్రులు కాదన్నారు. పీపుల్స్ మార్చ్‌తో ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని ప్రకటించారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాని కోసం పోరాడాల్సిందేనని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.