మంచిర్యాల జిల్లా మందమర్రి బొగ్గు గని పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి వార్షిక పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రిలోని అంగడి బజార్‌కు చెందిన కె. అజయ్ (16) సింగరేణి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ (SSC) పబ్లిక్ పరీక్షల పట్ల అజయ్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయేమోనన్న భయంతో ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో తన ఇంటి ముందున్న షెడ్డులోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక ఆత్మహత్య లేఖ లభ్యమైంది. పరీక్షల ఒత్తిడి వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, మానసిక ఒత్తిడి ఉంటే సహాయం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: మీకు లేదా మీకు తెలిసిన వారికి మానసిక ఒత్తిడి ఉంటే, సహాయం కోసం 'రోషిణి' హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించండి: 8142020033/44, 040-66202000/2001.