కరీంనగర్‌లో వార్డెన్‌ నిర్వాకం.. బావిలో జారిపడి విద్యార్థి మృతి

Class 8 student drowns while cleaning garbage in well in Karimnagar. కరీంనగర్ పట్టణ శివార్లలోని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని సెయింట్ ఆంథోనీస్

By అంజి  Published on  5 Dec 2022 7:41 AM IST
కరీంనగర్‌లో వార్డెన్‌ నిర్వాకం.. బావిలో జారిపడి విద్యార్థి మృతి

కరీంనగర్ పట్టణ శివార్లలోని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ ఆవరణలోని బావిలో ఆదివారం 8వ తరగతి చదువుతున్న మారం శ్రీకర్ (15) ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలపల్లి మండలం తేలుకుంటకు చెందిన శ్రీకర్‌, మరో ముగ్గురు విద్యార్థులు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చెత్త తొలగించేందుకు బావిలోకి దిగారు. వసతి గృహం వార్డెన్‌ నవీన్‌ ఆదేశాల మేరకు ఆ విద్యార్థులు బావిలోకి దిగారు.

మిగిలిన ముగ్గురు విద్యార్థులు చెత్తను తొలగించి పైకి ఎక్కినప్పటికీ శ్రీకర్ కనిపించకుండా పోయాడు. తోటి విద్యార్థులు అరవడంతో వార్డెన్‌.. అక్కడి నుంచి పారిపోయాడు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్‌ఎండీ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని ఈతగాళ్లతో వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు బావిలో నుంచి శ్రీకర్ మృతదేహాన్ని వెలికితీశారు. పదో తరగతి విద్యార్థులు తరచూ బావిలోని కలుపు మొక్కలు, ఇతర చెత్తను తొలగిస్తున్నారని విద్యార్థులు తెలిపారు.

ఆదివారం కూడా బావిలోని చెత్తను తొలగించాలని నలుగురు విద్యార్థులకు వార్డెన్‌ సూచించారు. మరోవైపు బాలుడి బంధువులు, కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో మృతదేహంతో నిరసన తెలిపారు. హాస్టల్‌ వార్డెన్‌ను సంఘటనా స్థలానికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. శ్రీకర్ కుటుంబ సభ్యులు పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్ నవీన్‌ను పోలీసులు జైలుకు తరలించినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story