తెలంగాణలోని జహీరాబాద్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక తన తండ్రిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 11న అలియా బేగం అనే బాలిక తన తండ్రిపై ఇతరులు దాడికి పాల్పడినప్పుడు అతడిని రక్షించేందుకు ప్రయత్నించింది.
అంతారం గ్రామంలో వీర, విజయ్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నివాసానికి సమీపంలో ఉన్న బహిరంగ మైదానంలో అలియా బేగం తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్ మూత్ర విసర్జన చేయడంతో గొడవ మొదలైంది. తమ నివాసానికి సమీపంలో ఇస్మాయిల్ మూత్ర విసర్జన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీర, విజయ్ రెడ్డి ఇద్దరూ అతనిపై దాడి చేశారు. తన తండ్రిపై దాడి చేయడం చూసిన అలియా బేగం అతడిని రక్షించేందుకు పరుగెత్తింది.
అదే సమయంలో ఆమెపై కూడా దాడి జరిగింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె ఫిబ్రవరి 15 న మరణించింది. ఈ ఘటన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కూడా కలిశారు.