సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ దంపతులు యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం బయలుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. ఎన్‌వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి వచ్చారు. లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను వారు వీక్షించనున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.