మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కేసు
Choutuppal police filed case on MLA Rajagopal Reddy.నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 27 July 2021 6:01 PM ISTనల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్నచౌటుప్పల్ పురపాలిక పరిధిలోని లక్కారంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ కార్యక్రమం రసాభాస అయింది. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేషన్‌కార్డుల పంపిణీలో గొడవ చేసిన ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై చౌటుప్పల్ తాసిల్దార్ గిరిధర్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే..
తనకు ముందుగా సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నల్లొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లైక్సీపై ఎమ్మెల్యే ఫోటో పెట్టారని, ఇక్కడెందుకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేనని తనపై వివక్ష చూపుతున్నారన్నారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, ఆత్మహత్యలను రూపుమాపామన్నారు. 2014 జూన్‌కు ముందు రాష్ట్రంలో, జిల్లాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఆయన మంత్రి కాలేకపోయేవారన్నారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదని.. పార్లమెంట్‌లో ఎంపీగా పోరాడానని, వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారన్నారు. మంత్రి చేతిలోంచి మైకు లాక్కునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, పురపాలిక చైర్మన్ రాజు తదితరులు ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఆదేశంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు సమావేశ హాలు నుంచి బయటకు పంపారు. ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసిస్తూ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.