సిద్ధిపేటలో రూపాయికే చిట్టి 'ఇడ్లీ'.. టేస్ట్‌లో వేరే లెవల్
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లగానే ఎదురుగా చిన్న బండిపై టిఫిన్ సెంటర్ కనబడుతుంది.
By అంజి Published on 16 July 2023 9:51 AM ISTసిద్ధిపేటలో రూపాయికే చిట్టి 'ఇడ్లీ'.. టేస్ట్‌లో వేరే లెవల్
రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఏదీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న వ్యాపారులు సైతం ధరలను రెట్టింపు చేస్తున్నారు. కానీ ఆ టిఫిన్ సెంటర్‌లో మాత్రం 25 ఏళ్ల నుంచి ఒకే ధరకు ఇడ్లీలను అందిస్తున్నారు. రూపాయికే ఇడ్లీ అమ్మే ఆ టిఫిన్ సెంటర్ సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం దగ్గరలో ఉంది. చిన్న బండిపై టిఫిన్ సెంటర్‌ని నడుపుతున్నారు. ఈ టిఫిన్ సెంటర్ సిద్ధపేట వారికి మాత్రమే కాకుండా, చుట్ట పక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి కూడా ఎంతో సుపరిచితం. మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరుగుతున్న ఈ టిఫిన్ సెంటర్‌లో మాత్రం రూపాయికే చిట్టి ఇడ్లీ లభిస్తోంది.
ఇక ఉప్మా కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇతర టిఫిన్ సెంటర్లలో ప్లేట్ ఇడ్లీ రూ.40 వరకు ఉంటోంది. అయితే తక్కువ ధరకే అందరీ కడుపు నింపాలన్న ఆలోచనతోనే ఈ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. గడిచిన 25 ఏళ్లుగా అదే బండి, అదే ధరతో టిఫిన్ సెంటర్‌ని నిర్వహిస్తున్నారు. సిద్ధిపేటకు చెందిన సత్యనారాయణ గతంలో ఇతర హోటళ్లలో 15 ఏళ్లు పని చేశాడు. ఆ అనుభవంతోనే చిట్టి ఇడ్లీలు అమ్మేందుకు సిద్ధమయ్యాడు. మొదట్లో చిట్టి ఇడ్లీలు తయారు చేస్తూ వీధుల్లో తిరుగుతూ అమ్ముకునేవాడు. తర్వాత ఒకచోట టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. తక్కువ ధరకు టేస్ట్‌గా ఇడ్లీ తయారు చేస్తూ కస్టమర్ల మన్నన సంపాదించుకున్నాడు. అలా టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
25 ఏళ్లుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నానని ఇడ్లీ సెంటర్ నిర్వాహకుడు సత్యనారాయణ తెలిపారు. రూపాయితో చిట్ట ఇడ్లీ ప్రారంభించానని, ఇప్పటికీ అదే ధరకు అమ్ముతున్నానని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టిఫిన్ సెంటర్ నడుపుతానని, చాలా గిరాకీ ఉంటుందని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇడ్లీలు తింటున్నాడనని పాల సందీప్ కుమార్ అనే కస్టమర్ తెలిపాడు. ఇక్కడ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందన్నారు. ఇక్కడ చిట్టీ ఇడ్లీలు రూ.10కి పది ఇస్తారు, ఇక్కడ రుచి చూస్తే.. మరెక్కడా తినరు.. అంత బాగుంటుందని తెలిపారు.