13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆథిత్యం
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 11 Jan 2024 7:19 AM IST
13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆథిత్యం
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు.
'అభయహస్తం' గొడుగు కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని వారిని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.