స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్య్ర సంబురాలను జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్.. మువ్వన్నెల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పోరాటాల చరిత్రలోనే స్వాతంత్య్ర పోరాటానిది మహోన్నత ఘట్టమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. గాంధీ వచ్చిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా సాగిందన్నారు. ఉప్పుసత్యాగ్రహంలో భాగంగా చేపట్టిన... దండి యాత్ర అద్భుత ఘట్టమన్నారు కేసీఆర్. ఈ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారన్నారు. హైదరాబాద్‌కు చెందిన సరోజినీ నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారని గుర్తుచేశారు.
ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, బలిదానాలతో సిద్ధించిన స్వాతంత్రోద్యమాన్ని మననం చేసుకునేలా.. 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం రమణాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేసిందన్నారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తామన్నారు. నేటి తరం వారికి.. స్వాతంత్ర్య పోరాటాన్ని తెలియజేసేందుకు.. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కార్యక్రమాల రూపకల్పన చేస్తుందన్నారు. అన్ని విద్యాసంస్థల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు