ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ఉండాల్సిందే. పండుగలు, దావత్‌లు సందర్భం ఏదైనా కానీ నాజ్ వెజ్ లేనిదే కొందరికి ముద్ద దిగదు. అయితే.. చికెన్ ప్రియులకు చేదు వార్త ఇది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. చికెన్‌ను కొనాలంటే పర్సు ఖాళీ అవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు డబుల్ సెంచరీ దాటిన చికెన్ ధర నేడు ఏకంగా ట్రిపుల్ సెంచరీని క్రాస్ చేసి సామాన్యులకు గట్టి షాక్ ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.300కు విక్రయిస్తున్నారు. విజయవాడలో కేజీ చికెన్ ధర రూ.306కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లోనూ రూ.290 నుంచి రూ.310 మధ్య పలుకుతోంది. దీంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు చికెన్ అంటేనే భయపడిపోతున్నారు. కాగా.. చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో ముఖ్యంగా పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం ఒకటైతే.. మరోవైపు వేసవి ఉష్షోగ్రతల కారణంగా కోళ్లు చనిపోవడం మరొకటి. బర్డ్ ఫ్లూ లాంటి వదంతుల కారణంగా కొత్త జాతులు ఉత్పత్తి కావడం లేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ సరిఫడా సఫ్లై లేకపోవడంతో కోళ్ల ధరలు పెరుగుతున్నాయి.